యాసంగి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా చూడండీ..జిల్లా కలెక్టర్
యాసంగి(రబీ) 2024-25 కు సంబంధించి ధాన్యం సేకరణ సజావుగా జరుగాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.ధాన్యం సేకరణ గురించి సన్నాహక సమావేశం రాయగిరిలోని లింగ బసవ గార్డెన్ లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంట కాలంలో ధాన్యం సేకరణ సజావుగా జరిగిందని , అదేవిధంగా రానున్న యాసంగి పంట కాలంలో అధిక దిగుబడి రానున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఇప్పటినుంచి ధాన్యం సేకరణకు సంబంధించిన సన్నాహాలు చేయాలని సూచించారు. గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు తల ఎత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఏజెన్సీ అధికారులు మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని, గ్రామస్థాయిలో క్రమ పద్ధతిన దశలవారీగా కోతలు జరిగే టందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దాని కొరకు హార్వెస్టర్ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయమని సూచించారు.

జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ..
రానున్న రబీ సీజన్లో గత సీజన్ కంటే రెట్టింపు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్నందున దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో మరియు మిల్ పాయింట్లలో సరిపడు హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రానున్న వేసవి దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో మంచినీటి వసతి మరియు టెంట్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. అదేవిధంగా ఈ సీజన్లో అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి కేంద్రం కు అనువైన ఎగువ ప్రాంతంలో ఉన్న స్థలాన్ని గుర్తించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ఒక్కొక్కరికి 30 చొప్పున టార్పాలిన్లు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ వారికి సూచించారు. జిల్లాలో సుమారు 395 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి వచ్చిన ధాన్యాన్ని క్రమ పద్ధతిలో తగు నాణ్యత పరిమాణాలతో తీసుకోవాలని , అదేవిధంగా కేంద్రం నిర్వహణలో ప్రముఖమైన బుక్ కీపింగ్ ట్యాబ్ ఎంట్రీ విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. ధాన్యం చెల్లింపుల విషయంలో వెనువెంటనే ఓపిఎంఎస్ లో టాబ్ ఎంట్రీ చేసి రైతులకు 48 గంటల్లో వారి ఖాతాలకు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచుల నిర్వహణ ముఖ్యమైనందువలన ఆ ప్రక్రియను సరిగా నిర్వహించాలని కోరారు. మిల్లర్ల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండడానికి గాను నాణ్యమైన తూర్పార పట్టిన ధాన్యాన్ని తగినంత తేమశాతంతో కొనుగోలు చేసి పంపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరికృష్ణ , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి , జిల్లా సహకార అధికారి శ్రీధర్ , మరియు జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్,జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి సాయి కృష్ణ, జిల్లా కోపరేటివ్ అధికారి రవీందర్, సహాయ పౌర సరఫరాల అధికారిని రోజా , జిల్లాలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, ఇతర అధికారులు హాజరయ్యారు.