యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సువర్ణ దివ్య విమాన రాజగోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవములు వైభవంగా జరుగుతున్నాయి. వైభవోపేతంగా కొనసాగుతున్న పంచకుండాత్మక యాగం మహాకుంభ సంరక్షణ పూజలు.
ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు సతీసమేతంగా హాజరై బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు. మహా పూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో, జిల్లా కలెక్టర్ అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. శ్రీ స్వామివారి బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం లో భాగంగా నిర్వహించు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈ రోజు ఉదయం అన్నమాచార్య భావనా వాహిని, అన్నమయ్య పురం, అన్నమయ్య పద కోకిల, పద్మశ్రీ డా.శోభారాజ్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు హైదరాబాద్ వారిచే భక్తి సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు.