వైభవముగా 3వ రోజు పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
ఆదివారం ఉదయం శ్రీ స్వామి వారి ఆలయములో నిత్యారాధనల అనంతరం పారాయణీకులచే వేదపారాయణములు, మూలమంత్ర, మూర్తిమంత్ర అనుష్ఠానములు గావింపబడినవి. అనంతరం శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవములలలో భాగంగా హవనము, మరియు శ్రీ స్వామి వారిని అమ్మవారలను అలంకరించి సింహవాహన శేవలో ఊరేగింపు వేడుకమ ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, పారాయణీకులు అత్యంత వైభవముగా నిర్వహించిరి.
ఈ వేడుకలలో ఆలయ అనువంశికధర్మకర్త శ్రీ బి.నరసింహమూర్తి గారు, కార్యనిర్వహణాధికారి, శ్రీ ఎ. భాస్కర్ రావు గారు, ఉపకార్యనిర్వహణాధికారి కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకొనిరి.
సింహవాహన శేవ ప్రత్యేకత..
బ్రహ్మోత్సవ వాహన శేవలలో ఎంతో ప్రత్యేకత కలిగినది సింహవాహన శేవ మృగాణాంచ మృగేంద్రోహం అని భగవద్ వచనము జంతువులలో మృగేంద్రము సింహము శౌర్యానికి పరాక్రమానికి ప్రతీక. పరాక్రమ జీవులలో సింహము ఉత్తమోత్తమ మైనది. సాక్షాత్ భగవానుడు సింహరూపమును ధరించి ప్రహ్లాదుని రక్షించి ఆశ్రిత రక్షణ తత్పరతను చాటినాడు. ఎన్నో ప్రత్యేకతలను కలిగిన ఈ సింహ వాహనముపై స్వామిని ఊరేగించుట ఎంతో విశిష్టత కలిగి ఉన్నది. ఈ సింహవాహనారూడుడైన స్వామి వారిని దర్శించిన సర్వవిధ దోషములు తొలగి భగవత్ అనుగ్రహం కలుగునని పురాణ వచనము.
సాయంకాల కార్యక్రమములు…
బ్రహ్మోత్సవములలో భాగంగా సాయంకాలం నిత్యారాధనల అనంతరము పారాయణీకులచే వేదపారాయణములు సాయంత్రం హవనము, నిర్వహించబడును.బ్రహ్మోత్సవములలో ప్రముఖమైన వేడుక శ్రీ స్వామి వారి అమ్మవారి ఎదుర్కోలు మహోత్సవము. ఈ ఉత్సవములో శ్రీ స్వామి వారిని, అమ్మవారలను ఆలంకరించి అశ్వవాహనారూడులను గావించి మేళతాళముల మధ్య ప్రధానార్పకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, అర్చక బృందం, పారాయణీకులు అంగరంగ వైభవముగా ఊరేగింపు వేడుక నిర్వహించెదరు. ఈ వేడుకలలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొని, శ్రీ స్వామి వారిని దర్శించుకొనెదరు.
ఎదుర్కోలు ఉత్సవము, ఆశ్వవాహన సేవ ప్రత్యేకత…
బ్రహ్మోత్సవములలో శ్రీ స్వామి వారి, అమ్మవారి ఎదుర్కోలు మహోత్సవము ఎందో ప్రత్యేకత కలిగియున్నది. శ్రీ స్వామి వారి అమ్మవారల దివ్య వైభవ కళ్యాణ గుణములను పేర్కొనుట ఈ ఉత్సవములోని ప్రత్యేకత, ఎదుర్కోలు అనగా వేడుకొనుట అని అర్థము. అనగా జీవాత్మ ప్రతినిధి అయిన అమ్మవారు మనలను రక్షించమని స్వామి వారిని వేడుకొను విధానమే ఈ ఎదుర్కోలు ఉత్సవము.
అశ్వ వాహనారూఢులై శ్రీ స్వామి వారు అమ్మవారు భక్తులకు దర్శనభాగ్యం కలిగింతురు. అశ్వము సర్వలక్షణ లక్షితమై నాలుగు వేదములకు ప్రతీకమై సత్త్వగుణమునకు సంకేతమై తెలుపు వర్ణము కలిగి ఉండి స్వామి వారికి, అమ్మవారికి ప్రీతిని కలిగించుచూ చూడముచ్చటైన ఈ వేడుకలలో ప్రధాన భూమికను వహించుచున్నది.
సాంస్కృతిక కార్యక్రమములు…
బ్రహ్మోత్సవములలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమములలో భాగంగా సాయంత్రము వీరప్రతాప భజన మండలి(గుండ్లపల్లి) వారిచే భజన కార్యక్రమము అనంతరం శ్రీ భాగ్యలక్ష్మీ భజన మండలి, (యాదగిరిగుట్ట) వారిచే భజన కార్యక్రమము,శ్రీమతి డి.ఎస్.శ్రీదేవి గారిచే భక్తి సంగీత కార్యక్రమము, సాయి స్నేహ నృత్యాలయ (హైద్రాబాద్) వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు.
